Donald Trump: ట్రంప్ కు ఎదురుదెబ్బ... ఎన్నికల్లో ఇద్దరు మహిళల్ని ప్రభావితం చేసిన కేసులో పర్సనల్ లాయర్ దోషిగా నిర్ధారణ!
- మన్హట్టన్లోని ఫెడరల్ కోర్టులో విచారణ
- ట్రంప్ కోసమే చేసినట్టు కోహెన్ తరపు న్యాయవాది వాదన
- ఎన్నికల సమయంలో కోహెన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ట్రంప్ తొలగించారు
- కోహెన్ ఆరోపణల్లో నిజంలేదని ట్రంప్ తరపు న్యాయవాది వాదన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దగ్గర పర్సనల్ లాయర్ గా పనిచేసిన మైఖేల్ కోహెన్ ను ఫెడరల్ కోర్టు దోషిగా తేల్చింది. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్ కు వ్యతిరేకంగా పనిచేసే ఇద్దరు మహిళలను డబ్బుతో ప్రభావితం చేసిన అభియోగంపై విచారణ జరిపిన మన్హట్టన్ ఫెడరల్ కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. 8 చార్జిషీట్లలో దోషిగా తేలిన కోహెన్పై పన్ను ఎగవేత అభియోగాలు కూడా వున్నాయి. అయితే ఆయన తరపు న్యాయవాది చెబుతూ, కోహెన్ ట్రంప్ కోసమే పనిచేశారని చెప్పటంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు.
అయితే ట్రంప్ తో వ్యక్తిగత సంబంధాలున్న ఇద్దరు మహిళల వ్యతిరేక ప్రచారాన్ని ఆపటం కోసం కోహెన్ పని చేసినట్టు కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఈ వ్యవహారంలో ఒకరికి లక్షా ముప్పై వేల డాలర్లు, వేరొకరికి లక్షా యాభై వేల డాలర్లు కోహెన్ ఇచ్చినట్టు ఆయన తరపు న్యాయవాది లానీ దావిస్ తెలిపారు. ఈ కేసులో కోహెన్ దోషిగా తేలటంతో ట్రంప్ షాక్ కు గురయ్యారు. అలాగే కోహెన్ తరపు న్యాయవాది ట్రంప్ కోసమే పని చేసినట్టుగా చెప్పటంతో ట్రంప్ కు చిక్కులు తప్పేలా లేవు.
దీంతో ట్రంప్ తనపై వచ్చిన అభియోగాలను ఖండించారు. తనను వ్యక్తిగతంగా అప్రతిష్టపాలు చెయ్యాలనే ఇద్దరు మహిళలతో సంబంధాలున్నాయని ఆరోపించారని ట్రంప్ తరపు న్యాయవాది రూడీ గిలియానీ పేర్కొన్నారు. కోహెన్ ట్రంప్ దగ్గర పని చేసిన సమయంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని తొలగించినట్టు తెలిపిన ట్రంప్ న్యాయవాది కోహెన్ ఆరోపణల్లో వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు.