Reliance: ఆర్కామ్ ఆర్థిక సంక్షోభం... జియోకు రూ.2 వేల కోట్ల ఆస్తుల అమ్మకం!
- జియో కు 248 నోడ్స్ ను అమ్మినట్టు ప్రకటించిన ఆర్కామ్
- రూ.2 వేల కోట్ల ఆస్తుల అమ్మకం
- ఇంకా రూ.25 వేల కోట్ల ఆస్తులు అమ్మే యోచన
ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడటానికి ఆర్కామ్ అధినేత అనిల్ అంబానీ తన అధీనంలోని కొన్ని ఆస్తులను ముఖేష్ అంబానీకి విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ సంస్థ రూ.2000 కోట్ల విలువైన ఆస్తులను రిలయన్స్ జియోకు అమ్మేసింది. వీటిలో 248 నోడ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆస్తులు కూడా వున్నాయి. ఇందులో భాగంగా 5 మిలియన్ల చదరపు అడుగుల ప్రాంతాన్ని కూడా టెలికాం మౌలిక వసతుల కోసం జియోకు బదిలీ చేసింది. ఈ క్రమంలో ఇంకా 25 వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడానికి ఆర్కామ్ ప్లాన్ చేసుకుంటోంది.
ప్రముఖ వ్యాపార దిగ్గజమైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ అప్పుల ఊబిలో చిక్కుకుపోవటంతో, సంస్థకు చెందిన వైర్లెస్ స్పెక్ట్రమ్, టవర్, ఫైబర్ అండ్ ఎంసీఎన్ ఆస్తులను అన్న ముకేష్ నేతృత్వంలోని రిలయన్స్ జియోకు విక్రయించడానికి గత డిసెంబర్లో ఒప్పందం చేసుకున్నారు. ఈ రోజు నోడ్స్ అమ్మకం పూర్తి కాగా, ఇంకా 122.4 మెగా హెడ్జ్ 4జీ స్పెక్ట్రమ్, 43000 టవర్లు, 1,78,000 కిలోమీటర్ల ఫైబర్ అమ్మకాలు ఇంకా ఈ ఒప్పందంలో వున్నాయి.