Dokka: పీడీ అకౌంట్స్ పై జీవీఎల్ ఆరోపణలపై డొక్కా ఫైర్
- జీవీఎల్ వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్
- పీడీ అకౌంట్స్ పై అవినీతి ఆరోపణల్లో నిజం లేదు
- పీడీ ఖాతాల విషయంలో కేంద్రప్రభుత్వ విచారణకైనా సిద్ధం
బీజేపీ నాయకులు గవర్నర్ ను కలిసి ఏపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మండిపడ్డారు. ఏపీలో బీజేపీకి నూకలు లేవన్న ఆయన, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, పీడీ అకౌంట్స్ లో అవినీతికి ఆస్కారమే లేదని చెప్పారు. దేశంలో ప్రతీ రాష్ట్రానికీ పీడీ అకౌంట్స్ వుంటాయని చెప్పిన ఆయన, కాగ్ అన్ని రాష్ట్రాల్లోనూ తన నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఎలాంటి విచారణకైనా టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా వుందని, అవసరం అనుకుంటే పీడీ అకౌంట్స్ పై కేంద్రప్రభుత్వ విచారణ కూడా జరుపుకోవచ్చని చెప్పారు.
ఏపీలో ప్రతిపక్షానికి అనుకూలంగా జీవీఎల్ వ్యవహరిస్తున్నారని, ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని, ఇది దురదృష్టకరమని ఆరోపించారు. కేరళలో వరదల పరిస్థితి దారుణంగా వుంటే కేంద్రం దాన్ని కూడా దుష్ప్రచారం చేస్తోందని మండి పడిన డొక్కా మాణిక్యవరప్రసాద్ గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ మరణంపై సంతాపం వ్యక్తం చేసిన ఆయన ఎమర్జెన్సీ సమయంలో నయ్యర్ తన ఆర్టికల్స్ తో దేశానికి చాలా విలువైన సమాచారం ఇచ్చారని అన్నారు.