Telangana: తెలంగాణలో టీడీపీతో పొత్తు వద్దే వద్దు: రాహుల్కు లేఖ రాయనున్న విజయశాంతి
- తెలంగాణలో టీడీపీతో పొత్తు వద్దు
- పొత్తుతో కాంగ్రెస్ భారీగా నష్టపోతుంది
- కావాలనే కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేయనున్నాయన్న వార్తలపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి స్పందించారు. టీడీపీతో కనుక పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగితే కాంగ్రెస్ భారీగా నష్టపోతుందని భావిస్తున్న ఆమె త్వరలోనే పార్టీ అధ్యక్షుడు రాహుల్కు లేఖ రాయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. విభజన తర్వాత చాలా సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడానికి చంద్రబాబే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీతో పొత్తుపెట్టుకుంటే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
కాంగ్రెస్ నేతలు కొందరు అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విజయశాంతి అభిప్రాయపడ్డారు. టీడీపీతో కనుక పొత్తు పెట్టుకుంటే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆమె అభిప్రాయపడినట్టు ఆమెతో సన్నిహితంగా ఉండే నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు వల్ల హైదరాబాద్లో కొన్ని సీట్లు గెలుస్తామన్న ఉద్దేశంతోనే కొందరు నేతలు పొత్తుకు రెడీ అవుతున్నారని ఆమె విమర్శించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ త్వరలోనే రాహుల్కు లేఖ రాయాలని విజయశాంతి యోచనలో ఉన్నట్టు మెదక్ జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.