plastic: ప్లాస్టిక్ భూతంతో ఊబకాయం.. కాలిఫోర్నియా శాస్త్రవేత్తల వెల్లడి!
- ఎలుకలపై పరిశోధనల్లో గుర్తించినట్లు వెల్లడి
- పీవీసీ తయారీకి ఉపయోగించే డీబీటీ కారణమని గుర్తింపు
- గ్లూకోజ్ జీవప్రక్రియను దెబ్బతీస్తున్న వైనం
ప్లాస్టిక్ భూతం కారణంగా ఇప్పటి వరకు మనిషికి పరోక్షంగానే హాని జరుగుతోందనుకుంటున్నాం. అయితే, ఇది నేరుగా మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తోందని కాలిఫోర్నియా విశ్వవిద్యాయం శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఆహారం వల్లే వస్తుందనుకుంటున్న ఊబకాయానికి (ఒబేసిటి) ప్లాస్టిక్ కూడా ఓ కారణమని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో వీరు కనుగొన్నారు.
గ్లూకోజ్ జీవప్రక్రియను మార్చడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకు పోవడానికి ఇది కారణమవుతోందని, తద్వారా ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు వెంటాడుతున్నాయని తెలిపారు. ‘పాలీ వినైల్ క్లోరైడ్ (పీవీసీ) తయారీకి వినియోగించే డైబ్యుటైల్టిన్ (డీబీటీ) ఇందుకు కారణమని గుర్తించారు. ‘గృహోపకరణాలు, వైద్య పరికరాలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, ఇంట్లో ఉండే దుమ్ములో సైతం డీబీటీ వుంటుంది. ఇది మన శరీరంలోకి ప్రవేశించి కణాలు, కణజాలం గ్లూకోజ్‌ను స్వీకరించకుండా చేసి సహజసిద్ధమైన జీవక్రియను అడ్డుకుంటుంది. తద్వారా ఊబకాయం రావడానికే కాకుండా, టైప్-2 మధుమేహానికి కూడా ఇది కారణమవుతోంది’ అని శాస్త్రవేత్తలు తెలిపారు.