paruchuri: 'ఇంద్ర' సినిమా తీయడానికి అశ్వనీదత్ భయపడ్డారు: పరుచూరి గోపాలకృష్ణ
- 'ఇంద్ర' కథను చిన్నికృష్ణ రెడీ చేశాడు
- నిర్మాత అశ్వనీదత్ కి ఆ కథ నచ్చలేదు
- బి.గోపాల్ కూడా ఆలోచనలో పడ్డాడు
కథా రచయితగా .. సంభాషణల రచయితగా .. దర్శకుడిగా పరుచూరి గోపాలకృష్ణకి మంచి పేరు వుంది. అలాంటి పరుచూరి గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'ఇంద్ర' సినిమాను గురించి ప్రస్తావించారు. రచయిత చిన్నికృష్ణ 'నరసింహనాయుడు' వంటి సూపర్ హిట్ సినిమాకి కథ ఇచ్చి వున్నాడు. అలాంటి ఆయన చెప్పిన 'ఇంద్ర' కథ నిర్మాత అశ్వనీదత్ కి గానీ .. దర్శకుడు బి. గోపాల్ కి గాని నచ్చలేదు.
'ఇంతకు ముందే బాలయ్య బాబుతో రెండు ఫ్యాక్షన్ సినిమాలు తీసి వున్నాను .. అలాంటి సినిమానే తీయడం నాకు ఇష్టం లేదు. ఆల్రెడీ చిరంజీవితో నేను 'మెకానిక్ అల్లుడు' సినిమాతో దెబ్బతిని వున్నాను. మళ్లీ అలాంటి తప్పుచేయదలచుకోలేదు' అని బి.గోపాల్ అన్నారు.
అయితే కథను గోదావరి నేపథ్యం నుంచి కాశీలోని గంగ నేపథ్యానికి మార్చడంతో గోపాల్ కొంతవరకూ తృప్తి చెందాడు. కానీ అశ్వనీదత్ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవికి ఫోన్ చేసి విషయం చెప్పాను .. ఆయన రమ్మన్నారు. దగ్గరుండి చిన్నికృష్ణతో చిరంజీవికి 'ఇంద్ర' కథ చెప్పించాను. కథ వినగానే చిరంజీవి ఆనందంగా మమ్మల్ని దగ్గరికి తీసుకుని 'ఇది మనం చేస్తున్నాం' అన్నారు.