Virat Kohli: ఇక ‘క్విర్కీ’ ఛాలెంజ్ వంతు.. జాంటీ రోడ్స్ కు సవాలు విసిరిన విరాట్!
- క్యాచ్ ల వీడియోలు పంపాలని సవాల్
- టాప్-2 ఆటగాళ్లతో పోటీపడతానని వ్యాఖ్య
- 30న మొదలుకానున్న నాలుగో టెస్టు
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చాలామందిని కికీ ఛాలెంజ్ ఊపేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న కారు నుంచి దిగి డ్యాన్స్ చేసి, మళ్లీ కారు ఎక్కడం ఈ ఛాలెంజ్ కాన్సెప్ట్. అయితే, ప్రమాదకరమైన ఈ ఛాలెంజ్ పై పలు విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ పోలీసులు అయితే ఏకంగా సెలబ్రిటీలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా మరో ఛాలెంజ్ తెరపైకి వచ్చింది. అయితే ఇది కారు, బైక్ ల ఛాలెంజ్ కాదు. క్రికెట్ క్యాచ్ ల ఛాలెంజ్!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సహచరులు, మాజీ క్రికెటర్లకు క్విర్కీ క్యాచ్ ఛాలెంజ్ విసిరాడు. దీనికింద కేవలం 8 సెకన్లలో 6 క్యాచ్ లను మిస్ కాకుండా పట్టుకోవాలి. ‘సరే, 8 సెకన్లలో ఆరు వేర్వేరు క్యాచ్ లను ఒక్కటీ మిస్ కాకుండా పట్టుకోవాలి. మీరు సిద్ధమేనా?’ అంటూ విరాట్.. కేఎస్ రాహుల్, రషీద్ ఖాన్, డూప్లీసిస్, షకీబ్ అల్ హసన్ తో పాటు మాజీ క్రికెటర్లు జాంటీ రోడ్స్, గిబ్స్ కు సవాలు విసిరాడు. ఈ ఛాలెంజ్ లో టాప్ గా నిలిచిన ఇద్దరితో తాను పోటీ పడతానని చెప్పాడు. ఈ వీడియోను కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం భారత జట్టు టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్ ల సిరీస్ భారత్ ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్ లో నాలుగో టెస్టు సౌతాంప్టన్ లో ఈ నెల 30న మొదలుకానుంది.