Tamota: భారీగా పడిపోయిన టమోటా, ఉల్లి ధర!
- బహిరంగ మార్కెట్లో టమోటా రూ. 16
- రైతుకు దక్కుతున్నది రూ. 2 నుంచి రూ. 3 మాత్రమే
- ఈ ధర కూడా తగ్గుతుందంటున్న నిపుణులు
ఒక్కసారిగా మార్కెట్ కు భారీ స్థాయిలో వచ్చిన పంటతో టమోటా, ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో టమోటాను సాగు చేస్తున్న రైతులకు ఇప్పుడు కిలోకు రూ. 3 మాత్రమే దక్కుతోంది. బహిరంగ మార్కెట్లో వినియోగదారులు రూ. 15 నుంచి రూ. 16 పెట్టి కిలో టమోటాలను కొనుగోలు చేస్తుండగా, రైతుకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితి లేదు.
మదనపల్లి మార్కెట్లో గత నెలలో పది కిలోల నాణ్యమైన టమోటాకు రూ. 230 ధర పలకగా, ఇప్పుడది రూ. 5 వరకూ పడిపోయింది. కర్నూలు జిల్లాలో అయితే అది కూడా లభ్యం కావడం లేదు. కిలోకు రూ. 2 నుంచి రూ. 3 మాత్రమే ధర పలుకుతోంది. ఇందులోనూ పది శాతం కమిషన్, తరుగు మినహాయింపులు పోగా, రైతుకు లారీ బాడుగ ఖర్చు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.
ఇక ఉల్లి విషయానికి వస్తే, గత నెలలో ఇదే సమయంలో 700 టన్నుల వరకూ పంట దిగుబడి మార్కెట్లకు రాగా, ప్రస్తుతం అది 1300 టన్నులకు పెరిగింది. గత సంవత్సరం వచ్చిన సమస్యే ఇప్పుడూ వచ్చింది. కిలోకు రూ. 4.50 నుంచి రూ. 10 వరకూ మాత్రమే లభిస్తోంది. కర్నూలులో విక్రయించకుండా, గుంటూరుకు తీసుకెళ్లినా, ఇదే రేటు వస్తోందని, వచ్చే డబ్బు ఖర్చులకు కూడా సరిపోవడం లేదని ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం సాగు విస్తీర్ణం పెరిగిందని, ధర పడిపోవడానికి ఇది కూడా కారణమేనని విశ్లేషకులు అంటున్నారు. సమీప భవిష్యత్తులో ఈ ధర కూడా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.