Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల... సామాన్యులెవరికీ అద్దె గదులుండవని ప్రకటన!
- సెప్టెంబర్ 13 నుంచి 21 వరకూ సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- ఆపై అక్టోబర్ 10 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
- దాతలకు స్వయంగా వస్తేనే అద్దె గదులు
తిరుమలలో కొలువైన దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 10 నుంచి 18 వరకూ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 9వ తేదీన విష్వక్సేనుని ఊరేగింపు, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు, 18వ తేదీన జరిగే చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఈఓ అనిల్ సింఘాల్, అధికారులు భక్తులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ 9 రోజుల పాటూ సామాన్యులకు అద్దె గదులుండవని, గతంలో అద్దె గదుల నిర్మాణానికి నగదు సమర్పించిన భక్తులు స్వయంగా వస్తే మాత్రమే వారికి గదులుంటాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సాధారణ భక్తులు అర్థం చేసుకోవాలని అధికారులు కోరారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 13 నుంచి 21 వరకూ జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోగా, క్యూ లైన్ వెలుపల కూడా భక్తులు వేచివున్నారు. సర్వదర్శనం భక్తులకు 24 గంటల తరువాతే దర్శన సమయాన్ని కేటాయిస్తుండగా, టైమ్ స్లాట్ భక్తులకు దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శన టికెట్లున్న భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.