kolkata: చల్లగా షాపింగ్ చేసింది.. డబ్బులు అడిగితే చంపేయబోయింది!: బెంగాల్ లో ఓ మహిళ నిర్వాకం
- కిచెన్ చిమ్నీ కొన్న మహిళ
- చెక్ బౌన్స్ కావడంతో ఇంటికెళ్లిన కంపెనీ ప్రతినిధులు
- కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చిన వైనం
ఓ కంపెనీ నుంచి కిచెన్ చిమ్నీని కొన్న మహిళ.. అందుకు డబ్బులు చెల్లించాలని వెళ్లిన ఇద్దరు సేల్స్ మెన్ లను చంపేందుకు యత్నించింది. పశ్చిమబెంగాల్ లోని అలిపోర్ లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అలిపోర్ లో ఉంటున్న మధుమంతి సాహా(50) నెల రోజుల క్రితం ఓ కంపెనీ నుంచి కిచెన్ చిమ్నీని కొనుగోలు చేసింది. అయితే ఆ సమయంలో ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది . ఈ నేపథ్యంలో తన ఇంటికి వస్తే నగదు చెల్లిస్తానని చెప్పడంతో కంపెనీ ప్రతినిధులు అమిత్, సోమ్ నాథ్ అక్కడకు వెళ్లారు. వారిద్దరికి మర్యాద చేసిన సాహా కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చింది.
ఇది తాగిన అమిత్ పూర్తిగా మత్తులోకి జారిపోయాడు. ఇది గమనించిన సోమ నాథ్ సీనియర్ అధికారులకు ఫోన్ చేసేందుకు యత్నించాడు. కానీ సాహా అతడిని అడ్డుకుని ఫోన్ లాక్కుంది. అనంతరం తన పెంపుడు కుక్కను ఉసిగొల్పి చంపేందుకు యత్నించింది.
కానీ ఘటనాస్థలం నుంచి అతికష్టం మీద తప్పించుకున్న సోమ నాథ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఘటనాస్థలికి హుటాహుటిన చేరుకున్న పోలీసులు అమిత్ ను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కంపెనీ ఫిర్యాదుతో పోలీసులు సాహాను అరెస్ట్ చేశారు.