VEERAMACHINENI: వీరమాచనేని డైట్ తో నా షుగర్ తగ్గలేదు కానీ మా ఆవిడకు తగ్గింది!: మీడియాకు లేఖ రాసిన శాంతా బయోటెక్స్ అధినేత!

  • వీరమాచనేని వ్యాఖ్యలపై వివరణ
  • తనపై పెద్దగా ప్రభావం చూపలేదన్నవరప్రసాద్ రెడ్డి
  • 80 రోజులు డైట్ పాటించినట్లు వెల్లడి

షుగర్ ను తగ్గించడానికి వీరమాచనేని డైట్ పాటించడంపై చాలా తీవ్రమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ డైట్ ను పరిచయం చేసిన వీరమాచనేని రామకృష్ణ.. దీనివల్ల ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. 90 నుంచి 120 రోజుల పాటు ఈ ఆహార నియమాలు పాటిస్తే.. షుగర్ ను పూర్తిగా అరికట్టవచ్చని అంటున్నారు. శాంతా బయోటెక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి కూడా ఈ డైట్ తో ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారని వీరమాచనేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

తాజాగా ఈ విషయమై వరప్రసాద్ ఓ పత్రికకు లేఖ రాశారు. తాను, తన భార్య 80 రోజుల పాటు వీరమాచనేని ఆహార నియమాలను పాటించినట్లు వరప్రసాద్ తెలిపారు. ఈ డైట్ కారణంగా తన భార్యకు మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ఈ ఆహార నియమాలు తనపై పెద్దగా ప్రభావం చూపలేకపోయానని పేర్కొన్నారు. తన స్పందన కోసం పలువురు ఎదురుచూస్తున్నట్లు తెలియడంతోనే ఈ లేఖ రాస్తున్నానని అన్నారు.

వీరమాచనేని డైట్ లో చెప్పిన విధంగా తామిద్దరం వరి బియ్యం, పప్పులు, పండ్లు, దుంపలు, చక్కెర, బెల్లం భోజనంలో లేకుండా జాగ్రత్త పడినట్లు తెలిపారు. రోజుకు ఆహారంలో 70 గ్రాముల కొబ్బరినూనెతో పాటు, ఆవు నెయ్యి, 2-3 కోడిగుడ్లు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఇన్సులిన్ మాత్రలు, ఇంజెక్షన్లను వాడలేదన్నారు. ఇలా 80 రోజులు పాటించినా ఈ డైట్ తన షుగర్ వ్యాధిపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనీ, తన భార్య షుగర్ మాత్రం నియంత్రణలోకి వచ్చిందని వెల్లడించారు. డైట్ పాటించిన కాలంలో తన షుగర్ నిల్వలు 180, 190కి తగ్గలేదని వరప్రసాద్ తెలిపారు.

  • Loading...

More Telugu News