Telugudesam: ముస్లిం మైనార్టీల ఓట్లన్నీ టీడీపీకే: సీఎం చంద్రబాబు
- పవిత్ర ఆశయాల కోసం ఏర్పాటు చేసుకున్న సభ ఇది
- మైనార్టీ సోదరులకు అండగా ఉంటా
- కేబినెట్ లోకి త్వరలోనే మైనార్టీ మంత్రిని తీసుకుంటా
వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఒక్క ఓటు కూడా ఇతర పార్టీలకు వేయరని, ముస్లిం మైనార్టీల ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీకే వస్తాయని సీఎం చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరులో జరుగుతున్న ‘నారా హమారా..టీడీపీ హమారా’ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, పవిత్ర ఆశయాల కోసం ఏర్పాటు చేసుకున్న సభ ఇదని, ఈ సభను చూసి చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.
మైనార్టీ సోదరులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారికి అండగా ఉంటానని, వారి హక్కులను కాపాడతానని హామీ ఇస్తున్నానని అన్నారు. ముస్లిం మైనార్టీలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మైనార్టీల జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. కేబినెట్ లోకి త్వరలోనే మైనార్టీ మంత్రిని తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కుట్ర రాజకీయాలను అందరూ తిప్పికొట్టాలని, టీడీపీకి మైనార్టీలు అండగా నిలవాలని కోరారు. మైనార్టీ సోదరులను అన్ని విధాలా ఆదుకుంటామని రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, విశాఖలో రైల్వేజోన్, కడపలో ఉక్కు కర్మాగారం..ఇలా ప్రతి విషయంలో ఏపీని కేంద్రం మోసం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. లాలూచీపడ్డ నాయకులను పాతిపెడతామని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన సభ ఇదని, ఎన్డీఏపై రాజీలేని పోరాటం చేసి రాష్ట్ర హక్కులు కాపాడతామని హామీ ఇచ్చారు.