Telangana: పెద్దపేగు ఇన్ఫెక్షన్‌కు మలంతో చికిత్స.. త్వరలో హైదరాబాద్‌లో అందుబాటులోకి

  • పెద్ద పేగుకు మలంతో చికిత్స
  • ఫీకల్ ట్రాన్స్‌ప్లాంటేన్ పేరుతో ఇప్పటికే అందుబాటులోకి
  • అద్భుత ఫలితాలు ఉంటాయన్న వైద్యులు

వివిధ రకాల యాంటీ బయాటిక్స్ ఆవిష్కరణతో వైద్యులు పలు వ్యాధులకు చెక్ పెట్టగలుగుతున్నారు. అయితే, ప్రతి చిన్న వ్యాధికీ యాంటీబయాటిక్స్‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇది మరిన్ని కొత్త జబ్బులకు, పేగుల్లో ఇన్ఫెక్షన్లకు కారణం అవుతోంది. పెద్దపేగుల్లో వచ్చే ఇటువంటి ఇన్ఫెక్షన్లకు ఇప్పుడు సరికొత్త వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఈ వైద్యం గురించి చెబితే కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చేమో కానీ, ఫలితాలు మాత్రం అద్భుతం అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఈ వైద్యాన్ని ఎలా చేస్తారో తెలుసా.. మలంతో! చికిత్స పేరు ఫీకల్ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్టూల్ ప్లాంటేషన్ అని కూడా పిలుస్తారు.

దేశవిదేశాల్లో ఇప్పటికే ఈ చికిత్సను అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అకడమిక్‌ సదస్సులో గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు వైద్య చికిత్సపై చర్చించారు. ఈ వైద్య చికిత్సలో భాగంగా ఆరోగ్యవంతమైన వ్యక్తి నుంచి మలం సేకరించి బాధితులకు కొత్త జీవితాన్ని అందించనున్నారు. పెద్దపేగు ఇన్ఫెక్షన్‌కు ఫీకల్  ట్రాన్స్‌ప్లాంటేషన్‌ గొప్పగా పనిచేస్తుందని ఐఎస్‌జీఓఎస్ కార్యనిర్వహణ కార్యదర్శి, సన్‌షైన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌. బి. రవి పేర్కొన్నారు.

చికిత్సలో భాగంగా పూర్తి ఆరోగ్యవంతుడైన వ్యక్తి నుంచి సేకరించిన మలాన్ని శుద్ధి చేస్తారు. దానిని ద్రవరూపంలోకి మార్చి రోగి మలద్వారం ద్వారా పెద్దపేగుకు ఇంజెక్ట్ చేస్తారు. ఈ ప్రక్రియ జరిగిన రెండు మూడు రోజుల్లోనే రోగి మామూలు స్థితికి చేరుకుంటాడు. చికిత్స ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని, హైదరాబాద్‌లో ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు డాక్టర్ రవి వివరించారు.

  • Loading...

More Telugu News