harikrishna: ‘ఈసారి మన గవర్నమెంట్ వస్తుంది హరీ..నువ్వు చెప్పినట్లే చేద్దాం’ అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. నాటి విశేషాన్ని చెప్పిన సముద్ర!
- రైతు సమస్యలపై సినిమా తీసిన హరికృష్ణ
- స్వయంగా ఫోన్ చేసిన వైఎస్సార్
- రైతన్నల సమస్యలపై హరితో చర్చించిన నేత
రైతుల సమస్యలపై హరికృష్ణ తీవ్రంగా స్పందించేవారని డైరెక్టర్ సముద్ర అన్నారు. ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హరికృష్ణతో స్వయంగా మాట్లాడారని వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులకు ఏదో చేయాలనుకుని తపన పడ్డాననీ, కానీ అది నెరవేరలేదని హరి బాధపడేవారన్నారు.
రైతన్నల సమస్యలే ఇతివృత్తంగా 2003లో ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ సినిమాను తెరకెక్కించామని, ఈ సినిమాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించామని చెప్పారు. ఈ విషయంలో తాను, పోసాని కలసి చాలా రీసెర్చ్ చేశామని సముద్ర తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏవీ రైతులను పట్టించుకోవడం లేదనీ, అన్ని సమస్యలను కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకుంటున్నాయని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేసేవారని సముద్ర అన్నారు.
ఈ సినిమా చూసిన అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇలాంటి సినిమాను తీసినందుకు హరికృష్ణను అభినందించారని సముద్ర గుర్తుచేసుకున్నారు. హరికృష్ణకు స్వయంగా ఫోన్ చేసిన రాజశేఖర్ రెడ్డి ‘ఈ సంవత్సరం నా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది హరీ.. మీ సినిమాలో చూపించిన, చెప్పిన రైతుల సమస్యలన్నింటినీ మనం పరిష్కరిద్దాం’ అని మాట ఇచ్చినట్లు వెల్లడించారు. రైతుల సమస్యలను ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రంగా వాడిన రాజశేఖర్ రెడ్డి అప్పటి ఎన్నికల్లో ఘనవిజయం సాధించారని పేర్కొన్నారు.