kavitha: ఆరోపణలను నిరూపించండి.. రాజకీయ సన్యాసం తీసుకుంటా: కవిత
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్ఎస్ దే
- టీఆర్ఎస్ కు ప్రజలు ఇప్పటికే 100 మార్కులు వేశారు
- కాంగ్రెస్ నేతలకు అధికారం మాత్రమే కావాలి
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించబోమని... చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలకు టీఆర్ఎస్ ఎంపీ కవిత హెచ్చరికలు జారీ చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి రూ. 2 వేల కోట్ల కంటే తక్కువ నిధులు కేటాయించినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే కాంగ్రెస్ నేతలు సన్యాసం తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల గురించి తనకు తెలియదని... ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ దే గెలుపని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ కు ప్రజలు ఇప్పటికే 100 మార్కులు వేశారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా కాంగ్రెస్ నేతలకు భయం కలుగుతోందని కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలకు ప్రజల సంక్షేమం అవసరం లేదని... వాళ్లకు కావాల్సింది అధికారం మాత్రమేనని చెప్పారు. ప్రగతి నివేదన సభ కోసం ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటున్నామని తెలిపారు. జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడం సంతోషకరమని చెప్పారు. హైకోర్టు విభజనకు సంబంధించి కేంద్రం స్పందన కూడా శుభ సూచకమని తెలిపారు.