harikrishna: ఫ్లాష్ బ్యాక్: జూ.ఎన్టీఆర్ పేరు వెనుక కథ గురించి హరికృష్ణ చెప్పిన ఆసక్తికర విషయం!
- పిల్లలందరికీ పేర్లు పెట్టిన ఎన్టీఆర్
- జూ.ఎన్టీఆర్ నామకరణం వేళ ఆసక్తికర ఘటన
- నాటి ఆడియో ఫంక్షన్ లో వెల్లడించిన హరికృష్ణ
ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం తెల్లవారుజామున కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మరణంతో కుటుంబ సభ్యులతో సన్నిహితులు, అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే తన చిన్న కుమారుడికి నందమూరి తారకరామ్ అని పేరు పెట్టడానికి గల కారణాన్ని గతంలో జరిగిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా హరికృష్ణ వెల్లడించారు.
'నాన్నకు ప్రేమతో' ఆడియో లాంచ్ ఫంక్షన్ సందర్భంగా ఆ రోజు హరికృష్ణ మాట్లాడుతూ..‘‘మా నాన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ మా ఏడుగురు అన్నదమ్ములకు కృష్ణ అనే పేరు కలసివచ్చేలా పెట్టారు. అలాగే మా నలుగురు అక్కాచెల్లెళ్లకు ఈశ్వరీ అనే పేరు కలిపిపెట్టారు. నా పిల్లలు పుట్టినప్పుడు పేర్లు పెట్టాల్సిందిగా నాన్నగారి దగ్గరకు వెళ్లాను. దీంతో ఆయన ‘తరం మారింది నాన్నా. ఇప్పుడేవో కొత్తకొత్త పేర్లు పెట్టుకుంటున్నారు. జాన్ అంటూ ఏవేవో పేర్లు పెడుతున్నారు. నువ్వే పెట్టు’ అని చెప్పారు. దీనికి నేను ఒప్పుకోలేదు. ‘నా పిల్లలకు మీరే పేరు పెట్టాలి’ అని ఒత్తిడి చేశా. దీంతో ఇద్దరు పిల్లలకు జానకీ రామ్, కళ్యాణ్ రామ్ అని నాన్నగారు పేరు పెట్టారు. కానీ జూ.ఎన్టీఆర్ కు తారకరామ్ అని నేను పేరు పెట్టాను’’ అని చెప్పారు.
‘‘ఓ రోజు.. చిన్నవాడి(జూ.ఎన్టీఆర్)ని చూసి చాలా రోజులైంది. ఓసారి తీసుకురా అని మా నాన్న అడిగారు. దీంతో తారక్ ను వెంట తీసుకెళ్లాను. మా నాన్న తారక్ ను నీ పేరేంటి? అని అడిగారు. దీంతో జూ.ఎన్టీఆర్ ‘తాతగారూ.. నా పేరు తారక్ రామ్. డాడీ పెట్టారు’ అని జవాబిచ్చాడు. దీంతో ఆయన వెంటనే ‘నో... నీది నా అంశ.. నా పేరు నీకుండాలి’ అంటూ తారక్ రామ్ పేరును నందమూరి తారకరామారావుగా మార్చారు’’ అంటూ హరికృష్ణ ఆ రోజు తండ్రిని గుర్తుచేసుకున్నారు.