Nagarjuna Sagar: నిండుకుండలా మారిన నాగార్జున సాగర్... నేడు తెరచుకోనున్న గేట్లు!
- ఆగస్టులోనే తెరచుకోనున్న సాగర్ గేట్లు
- 582 అడుగులను దాటిన నీటి నిల్వ
- మధ్యాహ్నం తరువాత గేట్లు తెరిచే చాన్స్
గత కొన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేనట్టుగా, ఆగస్టు నెలలోనే నాగార్జున సాగర్ గేట్లు తెరచుకోనున్నాయి. నాగార్జున సాగర్ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, నిన్న రాత్రికి 582 అడుగులకు నీరు చేరింది. ఎగువ నుంచి 73 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, ఈ మధ్యాహ్నానికి 585 అడుగులకు నీటి మట్టం చేరే అవకాశాలు ఉన్నాయి.
ఎగువ నుంచి ఇదే వరద వస్తే, మధ్యాహ్నం గేట్లను ఎత్తేందుకు ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. నీటిని పులిచింతల వైపునకు వదులుతామని ప్రాజెక్టు సీఈ సునీల్ వెల్లడించారు. కాగా, ఎగువ నుంచి వస్తున్న లక్ష క్యూసెక్కుల వరద మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణపూర్ జలాశయంలోకి 1.35 లక్షల క్యూసెక్కులు వస్తుండగా, దాన్నంతా దిగువకు వదులుతున్నారు.