bahubali: ఇది మధ్యప్రదేశ్ ‘బాహుబలి‘.. కామెడీగా తెరకెక్కించిన అజ్ఞాత వ్యక్తి!

  • ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన వీడియో
  • బాహుబలిగా ఎంపీ సీఎం చౌహాన్, భల్లాలదేవగా సింధియా
  •  కాంగ్రెస్ చీఫ్ రాహుల్, తల్లి సోనియా గాంధీకి చోటు

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి- ది కన్ క్లూజన్ సినిమాలు తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. ‘బాహుబలి ది కన్ క్లూజన్’ పార్ట్ అయితే ఏకంగా రూ.1,500 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా ఆ సినిమాకు సంబంధించి మూడో పార్ట్ విడుదలైంది. ఏంటి? బాహుబలికి మూడో పార్ట్ రాజమౌళి ఎప్పుడు తీశాడు? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే, దాన్ని ఎవరో అజ్ఞాత వ్యక్తి షూట్ చేసి ఇంటర్నెట్ లో పెట్టాడు. అసలు బాహుబలి సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దాన్ని స్పూఫ్ ను సదరు వ్యక్తి తయారుచేశాడు.

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను బాహుబలిగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య సింధియాను భల్లాల దేవగా, దిగ్విజయ్ సింగ్ ను బిజ్జలదేవగా చూపించాడు.

‘శివరాజ్ సింగ్ చౌహాన్ అనే నేను మధ్యప్రదేశ్ ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కల్పిస్తాను. ఇందుకోసం నా ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడను. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా’ అంటూ బాహుబలి మ్యూజిక్ తో ఈ వీడియో పిచ్చ ఫన్నీగా ఉంది. ఇక శివలింగాన్ని ఎత్తే సీన్ లో అయితే ఈ వీడియోను తయారుచేసిన వ్యక్తి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని కూడా విడిచిపెట్టలేదు. కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ను ఇందులో కట్టప్పగా చూపించారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.


  • Loading...

More Telugu News