black money: పెద్ద కరెన్సీ నోట్ల రద్దు చారిత్రక వైఫల్యం: ‘కాంగ్రెస్’ నేత తులసిరెడ్డి
- నోట్ల రద్దు ఒక జాతీయ విపత్తు
- నల్లధనం నిర్మూలన కాలేదు
- తెల్లధనంగా మారిపోయింది
- రెండు వేల నోట్ల రూపంలో దాచుకునేందుకు సులువైంది
రిజర్వు బ్యాంక్ సమర్పించిన 2017-18 వార్షిక నివేదిక ద్వారా పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఒక చారిత్రక వైఫల్యమని, ఒక జాతీయ విపత్తు అని స్పష్టమైందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్లధనం, నకిలీ కరెన్సీ, అవినీతి, ఉగ్రవాదం, తీవ్రవాదం నిర్మూలన కోసం రూ.500, రూ.1000 నోట్ల చలామణిని రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8న ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన విషయం విదితమే అన్నారు. కానీ అందులో ఒక్క లక్ష్యం కూడా నెరవేరలేదని, నల్లధనం నిర్మూలన కాకపోగా తెల్లధనంగా మారిపోయిందని, రూ.2000 నోట్ల రూపంలో దాచిపెట్టుకునేందుకు మరింత సులువైందని విమర్శించారు.
నకిలీ కరెన్సీ నిర్మూలన కాకపోగా నకిలీ నోట్లు బ్యాంకుల్లోకి, అసలు నోట్లు నకిలీ మనుషుల చేతుల్లోకి వెళ్లాయని, సాక్షాత్తూ పోస్టాఫీసు, బ్యాంకు, రిజర్వుబ్యాంకు అవినీతి కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బంది కేవలం 2016 డిసెంబర్ 30వ తేదీ వరకే ఉంటుందని, ఆ తర్వాత అంతా మేలే జరుగుతుందని.. అలా జరగకపోతే ‘నడివీధిలో నన్ను ఉరి తీయండని’, ప్రధానమంత్రి గత ఏడాది నవంబర్ 13న గోవాలో ప్రకటించి, ఆరు వందల రోజులైనా ఇబ్బంది తప్పలేదని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా దాదాపు 150 మంది మరణించారని, 15 కోట్ల మంది దినసరి వేతన జీవులు రోడ్డున పడ్డారని, అనేక చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని తులసిరెడ్డి, జాతీయ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటు 2017-18లో 6.7 శాతానికి పడిపోయిందని విమర్శించారు.
బ్యాంకు మీద ప్రజలకు నమ్మకం పోయిందని, గతం కంటే ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ పెరిగినప్పటికీ బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు కొరత ఉందని పేర్కొన్నారు. ఒక్క హత్య చేస్తేనే ఉరిశిక్ష గానీ, యావజ్జీవ కారాగారశిక్ష గాని న్యాయస్థానం విధిస్తుందని, మరి 150 మంది మరణానికి కారణమైన ప్రధానమంత్రికి ఏ శిక్ష విధించాలి? అని ప్రశ్నించారు. మేలు జరగకపోతే నడివీధిలో ఉరితీయమని ప్రధానమంత్రే చెప్పారని, ‘ఉరి వద్దు..రాజీనామా చాలు’ అని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, రాజీనామా చేయకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే మోదీని, బీజేపీని అధికారంలో నుంచి దించుతారని తులసిరెడ్డి హెచ్చరించారు.