Revanth Reddy: కేసీఆర్ పై క్రిమినల్ కేసులు పెట్టి, బొక్కలో తోయాలి: రేవంత్ రెడ్డి
- ప్రగతి నివేదన సభ ఓ దిక్కుమాలిన సభ
- సభ కోసం వేలాది చెట్లను నరికించారు
- ట్రాక్టర్లపై ప్రజా రవాణా నిషేధమనే సంగతి తెలియదా?
ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. మధ్యయుగపు చక్రవర్తిలా కేసీఆర్ యవ్వారం ఉందని దుయ్యబట్టారు. కేరళ వరదలకన్నా ఇంకా పెద్ద ఉపద్రవం వచ్చినట్టుగా ప్రగతి నివేదన సభ ఉందని విమర్శించారు. సభకు వచ్చే 25 లక్షల మందిని టీఆర్ఎస్ సైన్యంలా చూపించాలనుకుంటున్నారని చెప్పారు.
సభకు ఊరికో ట్రాక్టర్ రావాలని కేసీఆర్ చెప్పారని, ట్రాక్టర్ పై ప్రజా రవాణా నిషిద్ధమనే విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. ట్రాక్టర్లలో ప్రజలను తరలిస్తున్న కేసీఆర్ పై కేసులు నమోదు చేయాలా? వద్దా? అని అడిగారు. ఖమ్మం జిల్లా నుంచి ట్రాక్టర్లను తరలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ లపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
హరితహారం అంటూ కబుర్లు చెప్పే కేసీఆర్... ప్రగతి నివేదన సభ కోసం వేలాది చెట్లను నరికించారని రేవంత్ మండిపడ్డారు. గ్రీన్ ట్రైబ్యునల్ వారు కేసీఆర్ పై కేసులు నమోదు చేసి, బొక్కలో తోయాలని సూచించారు. ఇదే సమయంలో హెచ్ఎండీఏ కమిషనర్ జనార్దన్ రెడ్డిపై రేవంత్ విమర్శలు గుప్పించారు. ఔటర్ రింగ్ రోడ్డుమీద గుంపగుత్తగా టోల్ ఫీజు ఎత్తి వేసే అధికారం మీకెక్కడిదని ప్రశ్నించారు. దిక్కుమాలిన సభ కోసం నిబంధనలను ఉల్లంఘిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.