KCR: మజ్లిస్ కు కేసీఆర్ బంపరాఫర్... ఆగమేఘాలపై కదిలిన ఫైళ్లు... రూ. 24 కోట్ల స్థలం కేటాయింపు!
- సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలు
- మిధాని వద్ద 6 వేల గజాల స్థలం
- నేటి కేబినెట్ లో తుది నిర్ణయం
నిన్న రాత్రి... తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో మజ్లిస్ పార్టీకి భూమి కేటాయింపు ఫైళ్లు ఆగమేఘాలపై కదిలాయి. తనకు మిత్రపక్షంగా ఉన్న మజ్లిస్ కు బంపరాఫర్ ఇస్తూ, మిధాని వద్ద సుమారు రూ. 24 కోట్ల విలువైన 6 వేల గజాల స్థలాన్ని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న కేసీఆర్, ఇప్పటికే పలు వర్గాలకు వరాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ ఆసుపత్రిని పెట్టాలని భావిస్తున్న ఒవైసీ, ఈ స్థలం కోసం చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు.
గతంలో నవీన్ మిట్టల్ హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్న వేళ, ఆసుపత్రికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వగా, ఓ మంత్రి ఫిర్యాదుతో తరువాత వచ్చిన కలెక్టర్ ఎన్ గుల్జార్ దాన్ని రద్దు చేశారు. అప్పట్లో మజ్లిస్ పార్టీ కోర్టును ఆశ్రయించినా, ఫలితం దక్కలేదు. ఈ విషయమై శనివారం సాయంత్రం కేసీఆర్ ను కలిసిన అసదుద్దీన్ ఒవైసీ, స్థలం కేటాయింపు ప్రస్తావన తేగా, వెంటనే కేసీఆర్ అంగీకరించినట్టు తెలుస్తోంది. నేడు జరిగే కేబినెట్ భేటీలో ఈ స్థలాన్ని నామమాత్రపు ధరకు మజ్లిస్ కు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక్కడ గజం భూమి ధర రూ. 40 వేలకు పైగా ఉండగా, రూ. 1000లోపే ప్రభుత్వం ఆఫర్ చేయనుందని అనుకుంటున్నారు.