eetala: బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ఆమోదం: మంత్రి ఈటల
- రూ.70 కోట్లతో 75 ఎకరాలలో ఆత్మగౌరవ భవనాలు
- హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ కు మరో ఐదెకరాలు
- ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.7,500కు పెంపు
బీసీ కులాలకు హైదరాబాద్ లో రూ.70 కోట్లతో 75 ఎకరాలలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించినట్టు మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో రెడ్డి హాస్టల్ నిర్మాణానికి మరో ఐదు ఎకరాలు కేటాయిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో గోపాలమిత్ర గౌరవ వేతనం రూ.8,500కు పెంచుతూ, అర్చకుల జీతాలు ప్రభుత్వ పరంగా ఇవ్వాలని, వారి పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు, ఆశా వర్కర్ల గౌరవ వేతనం రూ.6 వేల నుంచి రూ.7,500కు పెంపునకు ఆమోదించామని చెప్పారు.
అనంతరం, మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్యశాఖ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంల జీతం రూ.21 వేలకు, కాంట్రాక్టు డాక్టర్ల జీతం రూ.40 వేలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాలు చేపట్టాలని, ఎన్ యూ హెచ్ఎంలో పని చేస్తున్న 9 వేల మందికి కనీసవేతనాల పెంపునకు ఆమోదించినట్టు చెప్పారు. త్వరలో మరోసారి మంత్రి వర్గ సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో నిర్ణయాలు ఉంటాయని అన్నారు.