Narendra Modi: నా కోసం బ్యాంకు అధికారులు 32 సంవత్సరాలు వెతికారు!: ప్రధాని మోదీ
- ఎమ్మెల్యే అయ్యేవరకూ అకౌంట్ లో క్యాష్ లేదు
- బ్యాంకు అధికారులు బతిమాలుకున్నారు
- ఆసక్తికర విషయం చెప్పిన ప్రధాని మోదీ
తాను ఎమ్మెల్యే అయ్యేవరకూ తన బ్యాంకు ఖాతాలో కనీస మొత్తం ఉండేది కాదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్రమంలో తన కోసం బ్యాంకు అధికారులు 32 సంవత్సరాల పాటు వెతికిన ఆసక్తికర ఘటనను మోదీ వెల్లడించారు. స్కూల్లో చదువుకునే రోజుల్లో తనకు దేనా బ్యాంకులో స్టూడెంట్ అకౌంట్ ఉందని తెలిపారు. ఆ అకౌంట్ ఎప్పుడూ ఖాళీగానే ఉండేదని వెల్లడించారు.
కొంతకాలం తర్వాత తాను ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోయాననీ, దీంతో ఈ అకౌంట్ ను క్లోజ్ చేసేందుకు బ్యాంకు అధికారులు తనను వెతకడం మొదలుపెట్టారని మోదీ అన్నారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత తాను ఉన్న ప్రదేశాన్ని కనిబెట్టిన అధికారులు అక్కడకు చేరుకున్నారని చెప్పారు. ‘దయచేసి ఈ కాగితంపై సంతకం పెట్టండి. మీ బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయాలి’ అంటూ అధికారులు బ్రతిమలాడుకున్నారని ప్రధాని వెల్లడించారు. తాను ఎమ్మెల్యే అయ్యాక మరోసారి బ్యాంకు ఖాతాను తెరిచి నెలవారీ వేతనాన్ని డ్రా చేసేవాడినని పేర్కొన్నారు.
ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సేవలను నిన్న ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తన బ్యాంకు అకౌంట్ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. దేశవ్యాప్తంగా 650 బ్రాంచులు, 3,250 యాక్సస్ పాయింట్ల సాయంతో ఈ బ్యాంకు సేవలను అందించనుంది.