ELURU: తమ్ముడిపై దొంగతనం కేసు.. బావపై మరదలు కిడ్నాప్ కేసు.. మనస్తాపంతో అన్న ఆత్మహత్య!
- పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఘటన
- కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు
- సూసైడ్ నోట్ పై గోప్యత
కుటుంబ విలువలు ఎంతగా పతనమైపోతున్నాయో చెప్పే ఘటన ఇది. ఉపాధి కోసం అన్న కొనుగోలు చేసిన కారును తమ్ముడు ఎత్తుకెళ్లాడు. దీంతో సదరు వ్యక్తి తమ్ముడిపై దొంగతనం కేసు పెట్టాడు. వెంటనే తమ్ముడి భార్య తన భర్తను బావే కిడ్నాప్ చేశాడంటూ ఎదురు కేసు పెట్టింది. పోలీస్ అధికారులు ఈ కేసులో విచారణ పేరుతో పిలిపించడంతో మనస్తాపం చెందిన అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి ఏలూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఏలూరులోని బాపిస్టు చర్చి ప్రాంతంలో అన్నదమ్ములు ఇబ్రహీం ఖాన్, మహ్మద్ అలీఖాన్ లు తండ్రితో కలసి ఉంటున్నారు. వీరిద్దరూ కారు డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. రెండు నెలల క్రితం ఇబ్రహీం అప్పుచేసి కొత్త కారును కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 30న ఓ హోటల్ వద్ద పార్క్ చేసిన కారు మాయమైంది. దీంతో తన తమ్ముడే ఇంట్లో కారు తాళాలను దొంగలించాడనీ, ఇప్పుడు వాటి సాయంతో కారును ఎత్తుకెళ్లాడని ఫిర్యాదు చేశాడు.
మరుసటి రోజు అలీఖాన్ భార్య పోలీస్ స్టేషన్ కు వచ్చి తన భర్తను బావ ఇబ్రహీం కిడ్నాప్ చేశాడని కేసు పెట్టింది. అతనిపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరింది. అప్పుచేసి మరీ కొనుక్కున్న కారు పోవడం, కిడ్నాప్ కేసు బనాయించడంతో బాధితుడు ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ఓ వాటర్ ట్యాంక్ వద్ద నిన్న రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇబ్రహీం చనిపోయిన మరుసటి రోజే పోలీసులు తమ్ముడు అలీఖాన్ నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇబ్రహీం ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన సూసైడ్ నోట్ ను పోలీస్ అధికారులు గోప్యంగా ఉంచుతుండడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.