KCR: నిన్ననే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ అడుగు వేయకపోవడానికి కారణం?
- ప్రజల కోసం మరిన్ని తాయిలాలను సిద్ధం చేస్తున్న సీఎం
- రేపటిలోగా వివరాలన్నీ ఇవ్వాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం
- రేపు లేదా ఎల్లుండి మరోసారి క్యాబినెట్ భేటీ
- ఆ తరువాతనే అసెంబ్లీ రద్దుపై నిర్ణయం
అన్ని వర్గాల ప్రజలకూ మరిన్ని వరాలు ప్రకటించాల్సి వుందని, ఇంకొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించి, వాటిని ప్రజలకు దగ్గర చేసిన తరువాతనే అసెంబ్లీని రద్దు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే నిన్నటి క్యాబినెట్ లో కేసీఆర్, అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని తీసుకోలేదని తెలుస్తోంది. అదే విషయాన్ని ఆయన తన ప్రగతి నివేదన సభలో చెప్పకనే చెప్పారు కూడా. త్వరలోనే మరిన్ని నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పిన మాటల వెనుక ఉద్దేశం ఇదేనని విశ్లేషకులు అంటున్నారు.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు బీమా తదితర అన్ని పథకాలతో పాటు, తన మనసులో ఉన్న ఉద్యోగుల మధ్యంతర భృతి, పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి తదితరాలపైనా రేపటి లోగా అన్ని వివరాలూ పంపాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అన్ని వర్గాల ప్రజలకూ తాయిలాలు ప్రకటిస్తున్న కేసీఆర్, రేపు లేదా ఎల్లుండి మరోసారి క్యాబినెట్ ను సమావేశ పరచాలని భావిస్తున్నారు. ఆపై మరోసారి చర్చించి, నూతన హామీలపై ఓ నిర్ణయం తీసుకున్న తరువాతనే అసెంబ్లీని రద్దు చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
పలు కీలకాంశాలు పెండింగ్ లో ఉన్న తరుణంలో అసెంబ్లీని రద్దు చేస్తే, నష్టం అధికమన్న ఉద్దేశంతో ఉన్న కేసీఆర్, మంత్రి మండలి సమావేశంలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించారని సమాచారం. ఇదిలావుండగా, అన్ని శాఖల్లో క్యాబినెట్ కు పంపించాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటే, మంగళవారం మధ్యాహ్నంలోగా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నుంచి అన్ని శాఖలకూ ఆదేశాలు వెళ్లాయి. దీన్ని బట్టి రేపు సాయంత్రం లేదా ఎల్లుండి మరోసారి క్యాబినెట్ సమావేశం అవుతుందని భావిస్తున్నారు. ఆపై ఏడవ తేదీలోగా మరోసారి సమావేశమయ్యే క్యాబినెట్, అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయవచ్చని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు అంటున్నాయి.