senior naresh: ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించాయి!: సీనియర్ నటుడు నరేశ్

  • నన్ను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకున్నారు
  • శివాజీరాజాపై నమ్మకంతో ఒప్పందాలపై సంతకం చేశా
  • ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి

ఇటీవల అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిధులను దుర్వినియోగం చేసినట్టు వార్తలు రావడంతో దుమారం మొదలైంది. తాను ఒక్క పైసా దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే, తన ఆస్తి మొత్తాన్నీ పరిశ్రమకు రాసిచ్చేస్తానని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా సవాల్ విసరడంపై అసోసియేషన్ కార్యదర్శి, సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు.

ఈరోజు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శివాజీరాజా నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించాయని, తనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ‘నువ్వూ సంతకం పెట్టావు..నువ్వు తినే ఉంటావు’ అని తనను అన్నారని, శివాజీరాజాపై నమ్మకంతో ఒప్పందాలపై సంతకం చేశానని, అన్నారు. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయడం లేదని, తప్పు చెప్పడం లేదని, రజతోత్సవాలకు సంబంధించి జనరల్ సెక్రటరీగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అమెరికాలో ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యేందుకు చాలా మంది బిజినెస్ క్లాస్ లో ప్రయాణించారని, ఒక్కో టికెట్టుకు రూ.3 లక్షలు ఖర్చు చేశారని, ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలన్నది కార్యదర్శి నిర్ణయించాలని అన్నారు.

విశ్రాంత ఉద్యోగులను పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేద్దామని అనుకున్నామని, ఇంటిగుట్టు రట్టు కాకూడదనే ఇన్నాళ్లూ ఆగామని, ఎవరూ మీడియా ముందుకు కూడా రాకూడదని మొదట్లో అనుకున్నామని అన్నారు. 'మా' ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, వారే ఇటువంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని, ఎన్నికలు వచ్చినప్పుడే వాటి గురించి మాట్లాడతామని, అయినా, ‘మా’ అధ్యక్షుడిగా తాను పోటీ చేయనని, ఎవరైతే అధ్యక్ష పదవికి న్యాయం చేయగలరో వాళ్లే ఎన్నికవుతారని అన్నారు.

చిరంజీవిని అభినందించేందుకు వెళ్లిన సందర్భంలో, అప్పుడే ఈ విషయాలు ఆయనకు వివరించానని, కొంత సమయం తీసుకుని పెద్దలతో చర్చిస్తానని చిరంజీవి తనతో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఏకపక్ష నిర్ణయాలు జరిగాయని, తాను ఇంత ఆలస్యంగా బయటకు రావడం తప్పేనని చెప్పుకొచ్చారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వానికి అప్పగించాలని, విశ్రాంత న్యాయమూర్తులు, ఉన్నతోద్యోగులతో కమిటీ వేస్తే మంచిదని సూచించారు. ఈ వ్యవహారంలో అనవసరంగా పెద్దల పేర్లు ఎక్కువగా తీసుకొస్తున్నారని, పెద్దలకు కూడా ఇక్కడ ఏం జరుగుతోందన్న విషయం తెలియాలని, అందుకే, పెద్దలను కూడా తాము కలుస్తున్నామని అన్నారు. 

నిధులు దుర్వినియోగం జరిగాయని తాను అనడం లేదని, ఆరోపణలు వస్తున్నాయి  కనుక, కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని అన్నారు. ఇటీవల శివాజీరాజా తనకు ఫోన్ చేసి ఎన్నికలకు వెళ్దామని అన్నారని, రెండ్రోజులు ఆలోచించుకుని చెప్పు, కచ్చితంగా వెళ్దామని తాను బదులిచ్చానని నరేశ్ అన్నారు. తాను ఎన్నికల గురించి మాట్లాడటం లేదని, తాను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ గురించే మాట్లాడుతున్నానని, అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలనే పెద్దలు అనుకుంటున్నారని నరేశ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News