Rajasthan: నిందితుడిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులను గదిలోపెట్టి తాళం వేసిన గ్రామస్థులు!
- రూ.7 లక్షలు పోయాయంటూ వ్యాపారి ఫిర్యాదు
- అనుమానితుడిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు
- అడ్డుకుని గొడవకు దిగిన స్థానికులు
వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేయడానికి వచ్చిన నలుగురు పోలీసులను గ్రామస్థులు ఓ గదిలో పెట్టి తాళం వేశారు. రాజస్థాన్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు 70 మందిపై కేసులు నమోదు చేశారు. కేసు విషయానికి వస్తే.. బక్రీద్ సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యాపారులంతా డియోనర్లో జంతువధశాలకు చేరుకుని పండుగ జరుపుకున్నారు. సంబరాలు ముగిసిన తర్వాత ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఏడు లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయని, వాటిని మరో వ్యాపారి మంజూర్ అలీ (45) చోరీ చేశాడని ఆరోపించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంజూర్ను అరెస్ట్ చేసేందుకు కుచిల్ గ్రామానికి వచ్చారు. గమనించిన స్థానికులు నలుగురు పోలీసులనూ అడ్డుకున్నారు. బాధిత వ్యాపారి ఆరోపిస్తున్నట్టు ఆ చోరీతో మంజూర్ కు సంబంధం లేదని, అతడు అమాయకుడని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో గ్రామస్థులందరూ కలిసి పోలీసులను నిర్బంధించి ఓ గదిలో పెట్టి తాళం వేశారు. పోలీసులు తమ వద్ద ఉన్న ఫోన్లతో విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. వారొచ్చి వీరిని విడిపించారు. పోలీసులను నిర్బంధించినందుకు గాను 70 మందిపై కేసులు నమోదు చేశారు.