Amit shah: నేనే స్వయంగా రంగంలోకి దిగుతా!: ఎన్నికల ప్రచారంపై తెలంగాణ నేతలకు అమిత్ షా హామీ
- ప్రచార బాధ్యతలను చూసుకుంటా
- మిగతా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో నేతలున్నారు
- తన దృష్టంతా తెలంగాణపైనే అన్న అమిత్ షా
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగితే, తానే స్వయంగా రంగంలోకి దిగి, రాష్ట్ర ఎన్నికల ప్రచార బాధ్యతలను చూసుకుంటానని బీజేపీ రాష్ట్ర నేతలకు అమిత్ షా హామీ ఇచ్చారు. ముందస్తు వస్తే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలు ఉన్నందున, అక్కడ తన అవసరం ఉండబోదని, తెలంగాణపైనే తన దృష్టంతా ఉంటుందని, పూర్తి బాధ్యతలను తాను స్వీకరిస్తానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. 90 రోజుల పాటు 119 నియోజకవర్గాల్లో సభలను ఏర్పాటు చేయాలని సూచించిన ఆయన, 12 లేదా 15న మహబూబ్ నగర్ లో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరిద్దామని చెప్పినట్టు సమాచారం.
క్షేత్రస్థాయి కేడర్ చాలా తక్కువగా ఉన్న త్రిపురలోనే విజయం సాధించామని నేతలకు గుర్తు చేసిన ఆయన, బలమైన కేడర్ ఉన్న తెలంగాణలో సత్తా చాటుదామని, తెలంగాణ రాష్ట్ర సమితిపై సీరియస్ గా యుద్ధం చేద్దామని ఆయన అన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, బీజేపీ బలంగా మార్చుకుందామని ఆయన అన్నారట. ఈ నెలలో కనీసం నాలుగు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని, వాటికి తాను హాజరవుతానని చెప్పారని సమాచారం.