BJP: బీజేపీ వైపు మోహన్ లాల్ చూపు.. 2019 లోక్ సభ ఎన్నికల్లో పోటీ?
- ప్రధాని మోదీతో సమావేశమైన హీరో
- సేవా కార్యక్రమాలు వివరించానని వెల్లడి
- తిరువనంతపురం నుంచి పోటీకి ఛాన్స్
2019 లోక్ సభ ఎన్నికల్లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ బీజేపీ టికెట్ పై పోటీ చేస్తారా? కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పై కమలనాథులు మోహన్ లాల్ ను అస్త్రంగా ప్రయోగిస్తారా? తాజా పరిస్థితులను చూస్తుంటే సమాధానం అవుననే వినిపిస్తోంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు, స్వచ్ఛ భారత్ సహా కేంద్రం తీసుకున్న పలు చర్యలను మోహన్ లాల్ గతంలో సమర్ధించారు.
ఈ నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అయ్యారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించేందుకే ప్రధానిని కలుసుకున్నట్లు మోహన్ లాల్ తెలిపారు. దీంతోపాటు కేన్సర్ ఇన్ స్టిట్యూట్ ప్రారంభోత్సవం, మలయాళి సదస్సుకు మోదీని ఆహ్వానించానన్నారు. కాగా, మోహన్ లాల్ ను బీజేపీ కేరళలోని తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి శశిథరూర్ పై పోటీ చేయించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం కేరళలో బీజేపీకి జనాకర్షక నేత లేరనీ, మోహన్ లాల్ తో ఆ లోటు తీరే అవకాశముందని వ్యాఖ్యానిస్తున్నారు.