chennai: చెన్నైలో అనుచరులతో ర్యాలీకి దిగిన అళగిరి!
- ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీ ప్రారంభం
- మెరీనాబీచ్ లోని కరుణానిధి సమాధి వరకు ర్యాలీ
- భారీ భద్రత ఏర్పాటు
డీఎంకే బహిష్కృత నేత, కరుణానిధి కుమారుడు అళగిరి తన మద్దతుదారులతో చెన్నైలో శాంతియుత ర్యాలీ ప్రారంభించారు. ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్ నుంచి మెరీనా బీచ్ లోని కరుణానిధి సమాధి వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. ఈ ర్యాలీ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇది శాంతియుత ర్యాలీ కావడంతో ఎటువంటి ప్రసంగాలు ఉండవు. ర్యాలీ ముగిసిన అనంతరం, మీడియాతో అళగిరి మాట్లాడనున్నారు.
కాగా, నాడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో అళగిరిని రెండుసార్లు పార్టీ నుంచి బహిష్కరించారు. ఓసారి 2001లో, మరోసారి 2014లో అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ తర్వాత తిరిగి పార్టీలోకి రావాలని అళగిరి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కరుణానిధి ఇటీవల మృతి చెందిన తర్వాత కూడా అళగిరి చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. దీంతో, తనను తిరిగి పార్టీలోకి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని డీఎంకేను అళగిరి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు శాంతియుత ర్యాలీకి దిగారు. ఈ ర్యాలీ అనంతరం, తన భవిష్యత్తు కార్యాచరణను అళగిరి ప్రకటిస్తారని తెలుస్తోంది.