Narendra Modi: వివాదాస్పద మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ అరెస్ట్.. అప్పట్లో మోదీపై ఆరోపణలతో వార్తల్లో నిలిచిన భట్!
- అరెస్ట్ చేసిన గుజరాత్ సీఐడీ అధికారులు
- విచారణ కోసం అదుపులోకి
- 2015లోనే భట్ ను సస్పెండ్ చేసిన కేంద్రం
వివాదాస్పద మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ ను ఈ రోజు గుజరాత్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని తప్పుడు డ్రగ్స్ కేసులో ఇరికించడంపై భట్ తో పాటు మరో ఏడుగురు పోలీసులను సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ వివరాలను గుజరాత్ సీఐడీ డీజీపీ ఆశిష్ భాటియా బుధవారం మీడియాకు వెల్లడించారు.
1996లో గుజరాత్ లోని బనస్కాంత జిల్లాకు ఎస్పీగా భట్ పనిచేశారని తెలిపారు. అప్పట్లో రాజస్తాన్ కు చెందిన సుమేర్ సింగ్ రాజ్ పురోహిత్ అనే లాయర్ ను భట్ ఆదేశాల మేరకు పోలీసులు అరెస్ట్ చేశారని, పురోహిత్ బసచేసిన హోటల్ గదిలో ఒక కేజీ బరువున్న డ్రగ్స్ లభ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. కానీ రాజస్తాన్ పోలీసులు జరిపిన విచారణలో పురోహిత్ ను అక్రమంగా ఈ కేసులో ఇరికించినట్లు తేలిందన్నారు. ఇందుకోసం అతడిని పోలీసులే కిడ్నాప్ చేసినట్లు రాజస్తాన్ పోలీసులు గుర్తించారన్నారు. దీంతో ఈ ఘటనపై పురోహిత్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడన్నారు.
ఈ కేసు విచారణను జూన్ లో రాష్ట్ర సీఐడీకి అప్పగించిన హైకోర్టు 3 నెలల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సంపాదించిన సీఐడీ అధికారులు భట్ సహా 8 మంది పోలీసులను అరెస్ట్ చేశారు. 2015లో విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న కారణంతో భట్ ను కేంద్రం సర్వీస్ నుంచి తొలగించింది. ప్రస్తుత ప్రధాని, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలతో భట్ వార్తల్లోకి వచ్చారు. 2011, ఏప్రిల్ లో ఆయన గుజరాత్ అల్లర్లలో మోదీ పాత్ర ఉందంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి సంచలనం సృష్టించారు.