election commission: పక్కా ప్లాన్ తో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండండి: తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్
- కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం
- సీఈసీకి సోమవారం సవివర నివేదిక ఇస్తాం
- ఆధునిక ఈవీఎంలు, వీవీపీఏటీల నిర్వహణపై అవగాహన
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం కావాలని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి డాక్టర్ రజత్‌కుమార్ కలెక్టర్లకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించిన మరుక్షణం కార్యక్షేత్రంలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను కోరారు. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆధునిక ఈవీంఎంలు, వీవీపీఏటీ నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసీఎల్ అధికారులు హాజరై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రజత్ కుమార్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో అవసరమైన సిబ్బందిని గుర్తించడంతోపాటు వారికి శిక్షణ అందజేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. వీవీపీఏటీ నిర్వహణ, పనితీరుపై ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ రద్దుపై సీఈసీకి సమాచారం ఇచ్చామని, సోమవారం సవివర నివేదిక అందజేస్తామని తెలిపారు. డీజీపీ, కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారుల పోస్టులు ఖాళీ లేకుండా చూసుకోవాలని సూచించారు. గడచిన మూడేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహిస్తున్న అధికారుల జాబితా తయారు చేయాలని ఆదేశించారు.