nara lokesh: అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుంది?: నారా లోకేష్
- బీజేపీ డైరెక్షన్ లో కేసీఆర్ నడుస్తున్నారు
- కేసీఆర్ కు కేంద్ర ప్రభుత్వం బాగా సహకరిస్తోంది
- జగన్ ను కాపాడేందుకు బీజేపీ యత్నిస్తోంది
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ డైరెక్షన్ లో నడుస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్టు కేసీఆర్ చేస్తున్నారని అన్నారు. గత ఎన్నికలకంటే ముందే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందని... కానీ, కేసీఆర్ కే కేంద్ర ప్రభుత్వం బాగా సహకరించిందని దుయ్యబట్టారు. ఎన్నిసార్లు అడిగినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వని మోదీ... కేసీఆర్ కు మాత్రం అడగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చారని విమర్శించారు.
ముఖ్యమంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వని మోదీ... కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని చెప్పారు. కష్టాల్లో ఉన్న ఏపీని పట్టించుకోని మోదీ... కేసీఆర్ కోరికలన్నింటికీ ఆమోదముద్ర వేశారని విమర్శించారు. అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుందని ఎద్దేవా చేశారు. అవినీతిపరుడు జగన్ కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని లోకేష్ మండిపడ్డారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేసే బిల్లును కేంద్రానికి పంపితే... ఇంతవరకు ఆమోదముద్ర వేయలేదని విమర్శించారు. జగన్ ను కాపాడేందుకే ఈ బిల్లును పక్కన పెట్టారని అన్నారు.