Supreme Court: సుప్రీంకోర్టు మనదే.. రామమందిరం కట్టేస్తాం!: యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
- మీడియా సమావేశంలో మంత్రి వర్మ
- సుప్రీంకోర్టు తమదేనని వ్యాఖ్య
- నెటిజన్ల ఆగ్రహంతో వెనక్కి తగ్గిన మంత్రి
అయోధ్య రామమందిరం కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి ముకుత్ బిహారీ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిరం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందనీ, ఎందుకంటే సుప్రీంకోర్టు తమదేనని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అజెండాతో తాము అధికారంలోకి వచ్చినప్పటికీ, రామమందిర నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. యూపీలోని బహ్రెయిచ్ జిల్లాలో జరిగిన ఓ మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు.
‘అయోధ్యలో రామమందిర నిర్మాణం కచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు మనదే’ అని మంత్రి వర్మ వ్యాఖ్యానించారు. దీంతో సుప్రీంకోర్టుకు మతం రంగు పులమడం ఏమిటని పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో శర్మ వెనక్కి తగ్గారు. ‘సుప్రీం కోర్టు మనదే అని చెప్పడం అర్ధం భారతీయులందరిది అని చెప్పడమే. సుప్రీంకోర్టుపై మాకందరికీ పూర్తి నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.