ys jagan: ఎటు చూసినా జనమే.. ఖాళీ స్థలం కనిపించడం లేదు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు!: విశాఖ సభలో వైఎస్ జగన్
- రోడ్లు, వీధులు.. అన్నీ ప్రజలతో నిండిపోయాయి
- వైఎస్ హయాంలో విశాఖ టాప్ గేర్ లో నడిచింది
- చంద్రబాబు హయాంలో రివర్స్ గేర్ లో నడుస్తోంది
ఎటు చూసినా ఖాళీ స్థలం కనిపించడం లేదని, రోడ్లు, వీధులు, బిల్డింగ్ లపైనా.. అన్నీ జనంతో నిండిపోయాయని, వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు రెండు చేతులు జోడించి తన కృతజ్ఞతలు చెబుతున్నానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. విశాఖపట్టణం శివారు కంచరపాలెంలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్టణం టాప్ గేర్ లో దూసుకుపోయిందని, అదే, చంద్రబాబు హయాంలో రివర్స్ గేర్ లో వెనుకకు నడుస్తోందని ఇక్కడి ప్రజలు తనకు చెప్పారని అన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ విస్తీర్ణానికి చొరవ చూపింది, రహదారులు అభివృద్ధి చేసింది, కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడకుండా చూసింది తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని అన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత విశాఖలో అభివృద్ధి మందగించిందని, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఆయన ఇచ్చిన హామీలకు దిక్కూదివాణం లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.