Cricket: ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టు... అటూ ఇటూ మొగ్గు!
- ఓ సెషన్ ఇంగ్లండ్ వైపు...మరో సెషన్ భారత్ వైపు
- ఇరుజట్ల సహనానికి పరీక్ష పెడుతున్న పిచ్
- నాలుగో రోజు భారత్ బౌలర్లపైనే భారం
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆధిపత్యం అటూ ఇటూ ఊగిసలాడుతూ ఇరుజట్లనూ ఊరిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరిలో రాణించి గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి దిగిన భారత్ 174 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్కోరు 200 దాటడమే కష్టమనుకునే సమయంలో క్రీజ్‌లో అతుక్కుపోయిన ఆల్‌రౌండర్ జడేజా, తొలిటెస్టు ఆడుతున్న తెలుగు కుర్రాడు హనుమ విహారిలు ఇంగ్లండ్ బౌర్ల సహనానికి పరీక్ష పెట్టారు.
ఏడో వికెట్‌కు జడేజా, విహారీలు 77 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ పై పట్టుకోల్పోకుండా కాపాడారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగులు సాధించి విజయావకాశాలపై ఆశలు సజీవంగా ఉంచుకొంది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. భారత్ బౌలర్లు 67 పరుగులకే జెన్సింగ్స్, అలీల కీలక వికెట్లు పడగొట్టడంతో మళ్లీ వరుస వికెట్లు చేజిక్కించుకుంటుందని అనుకున్నారు. కానీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ అటువంటి అవకాశం ఇవ్వలేదు. మరో వికెట్ కోల్పోకుండా మూడో రోజు ఆట ముగించారు. నాలుగో రోజు బౌలర్లు సత్తాచాటితే మ్యాచ్ భారత్‌వైపు మొగ్గే అవకాశం ఉంది.
అరంగేట్రంతోనే ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు హనుమ విహారి సొగసైన బ్యాటింగ్, నిండైన ఆత్మవిశ్వాసంతో ఆడి టెస్టు క్రికెట్‌కు తాను అచ్చుగుద్దినట్లు సరిపోతానని నిరూపించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ తడబాటుకు లోనుకాకుండా బ్యాటింగ్ చేశాడు. 104 బంతుల్లో తొలి టెస్టులోనే అర్ధ సెంచరీ నమోదు చేశాడు. ఇన్నింగ్స్ కొనసాగుతున్న కొద్దీ మరింత ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేసి 56 విలువైన పరుగులు సాధించాడు. తన ఎంపిక విషయంలో సెలెక్టర్లు తప్పు చేయలేదని నిరూపించుకున్నాడు.