lakshma reddy: టీడీపీతో పొత్తుతో సీటు రాదని.. పార్టీని వీడేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ఉప్పల్ నేత లక్ష్మారెడ్డి!
- కాంగ్రెస్లో పొత్తుల చిచ్చు
- మహాకూటమిగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్న పార్టీలు
- వైరా సీటును సీపీఐకి ఇవ్వొద్దంటూ గాంధీభవన్ వద్ద ఆందోళన
ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు, ప్రతి పార్టీకీ ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కి అసమ్మతుల బెడద... కాంగ్రెస్కు పొత్తులతో ఇక్కట్ల సమస్య మొదలయ్యాయి. దీంతో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేందుకు ఆ పార్టీ ఉప్పల్ ఇన్చార్జి బండారు లక్ష్మారెడ్డి బయటకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు వైరా సీటు విషయంలో ఆ నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు హైదరాబాదులోని గాంధీభవన్ వద్ద ఆందోళనకు దిగారు.
ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, ఇతర పార్టీలన్నీ మహాకూటమిగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సీట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అసమ్మతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. తాజాగా పొత్తులో భాగంగా ఉప్పల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వీరేందర్ గౌడ్ బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతుండటంతో, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీటును ఆశిస్తున్న లక్ష్మారెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12న టీఆర్ఎస్లో చేరేందుకు ఆయన సమాయత్తమవుతున్నారు.