Hyderabad: హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం!
- మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ ప్రాంతాల్లో వర్షం
- స్తంభించిన జనజీవనం
- పలుచోట్ల నీట మునిగిన వాహనాలు
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, మోతీనగర్, రాజీవ్ నగర్, బోరబండ, యూసుఫ్ గూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, కోఠి, మెహిదీపట్నం, సైదాబాద్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్ నిలిచిపోయింది. పలుచోట్ల వాహనాలు నీటమునిగాయి.
కాగా, సుమారు గంటకు పైబడి నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ దానం కిషోర్ ఆదేశించారు. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలని, నగరంలోని అన్ని మ్యాన్ హోల్స్ ను తనిఖీ చేయాలని ఆదేశించారు.