Chandrababu: నోటీసులంటూ శివాజీ కొత్త డ్రామా మొదలెట్టారు!: బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు
- చంద్రబాబుకు బినామీయేమోనన్న అనుమానం కలుగుతోంది
- ఇదంతా ఒట్టి బూటకం
- శివాజీ వ్యాఖ్యలపై పోలీసులు విచారణ జరపాలన్న బీజేపీ నేత
తమ పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్న సినీ నటుడు శివాజీపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడడాన్ని చూస్తుంటే శివాజీ ఆయనకు బినామీయేమోనన్న అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. ఆమధ్య 'ఆపరేషన్ గరుడ' పేరుతో రాష్ట్రంలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ హాట్ టాపిక్ గా మారిన శివాజీ, తాజాగా చంద్రబాబుకు కేంద్ర సంస్థ నుంచి నోటీసులు రానున్నాయంటూ బాంబు పేల్చి తీవ్ర ఆరోపణలు చేశారు.
శివాజీ వ్యాఖ్యలపై కపిలేశ్వరయ్య తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదంతా ఒట్టి బూటకమని.. చంద్రబాబుకు కేంద్రం నోటీసులంటూ శివాజీ కొత్త డ్రామాకు తెరదీశారని విమర్శించారు. రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే శివాజీ వ్యాఖ్యలపై విచారణ చేయాలని కోరారు. అనంతరం పెట్రోల్ ధరలపై స్పందించిన కపిలేశ్వరయ్య, ఏపీలో పెట్రోల్ ధరల పెరుగుదలకు టీడీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. తక్షణమే పెట్రోల్ ధరలపై ఏపీ ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్ను భారాన్ని తగ్గించాలని కోరారు. రాష్ట్రాలు విధిస్తున్న పన్ను భారాన్ని ఉపసంహరించుకోవాలని గతంలో కేంద్రం కోరిందని ఆయన గుర్తు చేశారు.