Guntur District: స్వస్థలానికి చేరుకున్న కందేపి పృథ్వీరాజ్ మృతదేహం!
- అంబులెన్సులో భౌతికకాయం తరలింపు
- ఈ నెల 6న కాల్పుల్లో చనిపోయిన పృథ్వీ
- కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
అమెరికాలోని సిన్సినాటీలో ఉన్న ఫిఫ్త్ థర్డ్ బ్యాంకులో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు కందేపి పృథ్వీరాజ్(26) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. స్థానిక పోలీసులతో మాట్లాడిన తానా ప్రతినిధులు, భారత దౌత్య సిబ్బంది పృథ్వీరాజ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ భౌతికకాయం ఈ రోజు ఉదయం అతని స్వస్థలం తెనాలిలోని చెంచుపేటకు చేరింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన పృథ్వీ తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు.
అమెరికాలోని న్యూజెర్సీ నుంచి కార్గో విమానంలో తొలుత ముంబైకి, అక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు పృథ్వీ భౌతికకాయాన్ని అధికారులు తరలించారు. శంషాబాద్ నుంచి అంబులెన్సులో తెనాలిలోని చెంచుపేటకు తీసుకొచ్చారు. పృథ్వీరాజ్ ఐదేళ్ల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అనంతరం అక్కడే ఫిఫ్త్ థర్డ్ బ్యాంక్లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా ఉద్యోగంలో చేరాడు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న ఒమర్ ఎన్రిక్ శాంటా పెరేజ్(29) అనే దుండగుడు బ్యాంకు భవనంలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పృథ్వీరాజ్ సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఎదురుకాల్పుల్లో నిందితుడిని హతమార్చారు. కందేపి గోపీనాథ్, సుధారాణి దంపతుల ఇద్దరు సంతానంలో పృథ్వీరాజ్ పెద్దవాడు. గోపీనాథ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గృహనిర్మాణ శాఖలో ఈఈగా పనిచేస్తున్నారు.