Revanth Reddy: కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం!: ఐపీఎస్ లకు రేవంత్ రెడ్డి వార్నింగ్
- కొందరు ఐపీఎస్ లు ప్రభుత్వానికి మోకరిల్లుతున్నారు
- శాంతిభద్రతలను గవర్నర్ సమీక్షించాలి
- బాధ్యతలకు దూరంగా నరసింహన్ పారిపోకూడదు
తెలంగాణలోని కొందరు ఐపీఎస్ అధికారులు ప్రభుత్వానికి మోకరిల్లుతున్నారని... కాంగ్రెస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై విచారణ జరిపే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని... రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఐపీఎస్ అధికారుల సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. శాంతి భద్రతల సమస్యను గవర్నర్ నరసింహన్ సమీక్షించాలని విన్నవించారు.
తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను హైదరాబాద్, నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నియమిస్తున్నారని... తద్వారా తమపై దాడికి యత్నిస్తున్నారని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ గవర్నర్ సమీక్షించాలని... బాధ్యతలకు దూరంగా పారిపోకూడదని డిమాండ్ చేశారు. ఏదైనా జరిగితే మీరు కూడా చట్టం ముందు సమాధానం చెప్పాల్సి వస్తుందని అన్నారు.