Telangana: కొండగట్టులో ప్రమాదానికి ఆంజనేయ స్వామి ఆగ్రహమే కారణమంటున్న ప్రజలు!
- కొడిమ్యాలలో 60 వానరాల కళేబరాలు లభ్యం
- దొరికిన రెండ్రోజులకే ఘాట్ రోడ్డులో ప్రమాదం
- అంజన్న ఆగ్రహమే కారణమంటున్న గ్రామస్తులు
కొండగట్టు ఆంజనేయ స్వామి ఆగ్రహం కారణంగానే ఘాట్ రోడ్డులో ప్రమాదం సంభవించిందా? స్వామివారికి ప్రతిరూపంగా భావించే వానరాలను చంపేయడంతోనే ఈ బస్సు లోయలోకి పడిపోయిందా? జగిత్యాల జిల్లాలో చాలామంది ఈ విషయమై చర్చించుకుంటున్నారు. జిల్లాలోని కొడిమ్యాల మండలం, సూరంపేట మామిడివాగు దగ్గర దాదాపు 60 వానరాల కళేబరాలు కనిపించాయి. వీటిని పరిశీలించిన కొడిమ్యాల రేంజర్ లత.. వానరాలను కరెంట్ షాక్ పెట్టి హతమార్చినట్లు ఉందని వ్యాఖ్యానించారు.
మరోపక్క, కొండగట్టు ప్రమాదంలో ఇప్పటికి 60 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 60 వానరాలను హతమార్చడంతోనే ఆంజనేయ స్వామికి ఆగ్రహం వచ్చిందనీ, దీంతో ఘాట్ రోడ్డులో ప్రమాదం సంభవించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వానరాల కళేబరాలు లభ్యమైన రెండు రోజులకే ఈ ప్రమాదం జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఈ విషయమై పలు గ్రామాల ప్రజలు అంజన్నకు ఆగ్రహం రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.