Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో విరుచుకుపడనున్న పిడుగులు.. హెచ్చరించిన వాతావరణ శాఖ!
- తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరులకు హెచ్చరిక
- నెల్లూరు, చిత్తూరులోనూ ప్రకృతి ప్రకోపం
- జాగ్రత్తగా ఉండాలని సూచించిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 24 గంటల్లో కొన్ని జిల్లాలలో పిడుగులు విరుచుకుపడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది . తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం, అడ్డతీగల, తాళ్లరేవు, ముమ్మడివరం, గుంటూరు అర్బన్, పెదకాకాని, మేడికొండూరు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, బాలాయపల్లి, చిత్తూరు జిల్లా తొట్టంబేడు, కార్వేటినగర్, వెదురుకుప్పం, పెనుమూరులో పిడుగులు పడతాయని వెల్లడించింది.
కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్, రూరల్, బాపులపాడు, నూజివీడు, ఆగిరిపల్లి, జి.కొండూరులోనూ ఆకాశం మేఘావృతమై పిడుగులు విరుచుకుపడే అవకాశముందని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై వర్షం పడేలా ఉంటే విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలనీ, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.