Andhra Pradesh: చంద్రబాబు సహా నోటీసులు జారీ అయింది వీరికే..!
- 2010లో బాబ్లీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన
- చంద్రబాబు బృందాన్ని అరెస్ట్ చేసి కేసులు నమోదు
- ఇప్పుడీ కేసులో వారెంట్లు జారీ
బాబ్లీ నిరసనల కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మొత్తం 15 మందికి ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న వీరందరినీ కోర్టులో హాజరు పరచాల్సిందిగా మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కోర్టు నోటీసులు జారీ చేసిన వారిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, దేవినేని ఉమ, టి.ప్రకాశ్ గౌడ్, నక్కా ఆనందబాబు, గంగుల కమలాకర్, కేఎస్ఎన్ఎస్ రాజు, చింతమనేని ప్రభాకర్, నామా నాగేశ్వరరావు, జి.రామానాయుడు, సీహెచ్ విజయరామారావు, ముజఫరుద్దీన్ అన్వరుద్దీన్, హన్మంత్ షిండే, పి.అబ్దుల్ ఖాన్ రసూల్ ఖాన్, ఎస్. సోమోజు, ఏఎస్.రత్నం, పి.సత్యనారాయణ శింబు ఉన్నారు.
బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా అప్పటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు సహా 40 మంది టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ సరిహద్దులు దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించి బాబ్లీ ప్రాజెక్టు వద్ద ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు సహా అందరినీ అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అరెస్టుకు ముందు నేతలపై లాఠీ చార్జీ కూడా చేశారు. ఇన్నాళ్లపాటు ఉలుకుపలుకు లేకుండా ఉన్న ఈ కేసును ఇప్పుడు మళ్లీ తవ్వి తీసి చంద్రబాబు సహా నేతలందరికీ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.