Telangana: దాదాపు 7 గంటల పాటు ఫోన్ లోనే మాట్లాడుతూ ఉన్న కేసీఆర్!
- 105 మంది అభ్యర్థులకు ఫోన్లు చేసిన కేసీఆర్
- ఒక్కొక్కరితో నాలుగు నిమిషాల పాటు మంతనాలు
- కొత్త ఓటర్లు, బూత్ కమిటీలపై సలహా సూచనలు
తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన కేసీఆర్, మిగతా పార్టీలతో పోలిస్తే, ఎన్నికల ప్రచారం విషయంలో స్పీడుగా ఉన్నారు. ఇక, నిన్న ఆయన దాదాపు 7 గంటల పాటు ఫోన్ లోనే గడిపినట్టు తెలుస్తోంది. ఒక్కో అభ్యర్థికీ తానే స్వయంగా ఫోన్ చేసి, ఒక్కొక్కరితో కనీసం 4 నిమిషాల పాటు ఆయన మాట్లాడినట్టు సమాచారం.
కొత్త ఓటర్ల నమోదుపై దృష్టిని సారించాలని, బూత్ కమిటీల్లో బలమైన కార్యకర్తలను నియమించుకోవాలని ఆయన సూచించారట. ఇక ఎవరైనా అసంతృప్తులు ఉంటే, వారి సంగతిని తాను చూసుకుంటానని, వారిని తామే బుజ్జగిస్తామని అభయం ఇచ్చారట. స్థానిక నేతలందరితోనూ సమన్వయంతో పనిచేయాలని, ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసుకోవాలని కూడా కేసీఆర్ సూచించారట.