India: టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్.. అయినా భారత్ టాప్: అభిమానుల సెటైర్ల హోరు
- వన్డే, టెస్టు సిరీస్‌లో భారత్ ఘోర ఓటమి
- అయినా, తమదే ఉత్తమ జట్టన్న కోహ్లీ సేన
- బీజేపీ గ్రాఫ్‌ను ఉపయోగించి ఆటాడుకున్న నెటిజన్లు
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఘోర పరాజయాల్ని మూటగట్టుకుంది. వన్డే, టెస్టు సిరీస్‌లలో ఓడి అవమాన భారంతో ఇంటి ముఖం పట్టింది. టెస్టు సిరీస్‌ను మరింత ఘోరంగా ముగించింది. 1-4తో ఓడి అభిమానుల ఆగ్రహానికి గురైంది. సిరీస్‌ను ఓడిపోవడం ద్వారా భారత్ 10 పాయింట్లు కోల్పోయింది. అయినప్పటికీ భారత్ ర్యాంకులో ఎటువంటి మార్పు లేదు. కారణం రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికాకు, భారత్‌కు మధ్య పాయింట్ల విషయంలో భారీ తేడా ఉండడమే. కాగా, ఇంగ్లండ్ పర్యటనలో చెత్తగా ఆడినప్పటికీ ప్రపంచంలో తమదే అత్యుత్తమ జట్టని టీమిండియా పేర్కొనడంపై నెటిజన్లకు చేతినిండా పని దొరికినట్టు అయింది. సెటైర్లతో విరుచుకుపడుతున్నారు.
పెట్రో ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఇటీవల ఆందోళన ఉద్ధృతం చేసింది. ఈనెల 10న భారత్ బంద్ కూడా చేపట్టింది. దీంతో స్పందించిన బీజేపీ.. కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కైంది. తమ ప్రభుత్వ హయాంలో పెరిగిన ధరలను కాంగ్రెస్ హయాంలో పెరిగిన ధరలతో పోలుస్తూ ఓ ఇన్ఫోగ్రామ్ తయారు చేసింది. అయితే, 2014లో కాంగ్రెస్ హయాంలో ఉన్న లీటర్ పెట్రోలు ధర రూ.71.41ను ఎక్కువగా చూపి.. సెప్టెంబరు 10 నాటికి ఉన్న రూ.80.73ను బాణం గుర్తుతో తక్కువగా చూపించి అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడిదే గ్రాఫ్‌ను అభిమానులు టీమిండియాకూ ఉపయోగించి సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఒక టెస్టు గెలుచుకున్న ఇండియాను పైన, 4 టెస్టులు గెలుచుకున్న ఇంగ్లండ్‌ను తక్కువ చేసి చూపించారు. ఈ గ్రాఫ్‌పై రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.