Congress: ఉత్తమ్ సహా హస్తిన చేరిన 50 మంది కాంగ్రెస్ నేతలు... రాహుల్ తో కీలక సమావేశం!
- టీడీపీతో పొత్తుపై రాహుల్ కు వివరణ
- కాంగ్రెస్ లో చేరనున్న బండ్ల గణేష్, భూపతిరెడ్డి
- పొత్తులపై తుది నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ చిరకాల ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలు, అధిష్ఠానంతో విషయాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితర 50 మంది నేతల వరకూ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది.
వీరంతా మరికాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమై, పొత్తుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. టీడీపీకి ఎన్ని సీట్లు కేటాయించాలి? ఇతర కలిసొచ్చే పార్టీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఎక్కడ ఎవరు పోటీ పడాలి? తదితర విషయాలపై రాహుల్ కు తమ ఆలోచనలను వివరించనున్న నేతలు, ఆయన సలహా, సూచనలు తీసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా, ఈ సమావేశంలోనే నిర్మాత బండ్ల గణేష్, భూపతిరెడ్డి తదితరులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నారు. ఆపై టీడీపీ నేతలతో చర్చించి, పొత్తుపై అధికారిక ప్రకటన వెలువరిస్తారని సమాచారం.