Madhya Pradesh: ముఖ్యమంత్రి కంటే ఒక రోజు ముందే మెడికల్ కాలేజీని ప్రారంభించిన కాంగ్రెస్ ఎంపీ.. కేసు నమోదు!
- త్వరలో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు
- సీఎం ప్రారంభించాల్సిన కాలేజీని ఎంపీ ప్రారంభించిన వైనం
- రెండోసారి ప్రారంభించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ముఖ్యమంత్రి ప్రారంభించాల్సిన మెడికల్ కాలేజీని ఒక రోజు ముందే ప్రారంభించిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ కాంతిలాల్ భురియాపై కేసు నమోదైంది. కేంద్ర మాజీ మంత్రి అయిన కాంతిలాల్ ప్రస్తుతం రాట్లం-ఝబువా లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
త్వరలో మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్రెడిట్ కొట్టేయాలని భావించిన ఎంపీ.. అనుచరులతో కలిసి మంగళవారం తన నియోజకవర్గంలోని బంజిలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు చేరుకుని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించేశారు. నిజానికి ఈ కళాశాలను బుధవారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించాల్సి ఉంది.
ఈ ఘటనపై భురియా మాట్లాడుతూ మంగళవారం మంచి రోజనే దానిని ప్రారంభించినట్టు చెప్పారు. ఈ కాలేజీకి యూపీఏ ప్రభుత్వ హయాంలోనే అనుమతులిచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. కాలేజీని ఎంపీ ప్రారంభించినట్టు తెలియగానే అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలేజీ అధికారుల ఫిర్యాదుతో భురియా సహా మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. కాగా, రూ.350 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ మెడికల్ కళాశాలను బుధవారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోమారు ప్రారంభించడం విశేషం.