Pawan Kalyan: జనసేనలో చేరకుండా కాంగ్రెస్ ను ఎంచుకున్న కారణమిదే!: బండ్ల గణేష్
- సినిమా రంగమంటే ప్రాణం
- ఆశీర్వదించిన తండ్రి వంటి వ్యక్తి పవన్ కల్యాణ్
- దేవుడిలాంటి పవన్ గురించి మాట్లాడబోనన్న బండ్ల
తాను ఎంతో అభిమానించే పవన్ కల్యాణ్ స్థాపించిన పార్టీ జనసేనలో చేరకుండా, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనసేనను కాదని కాంగ్రెస్ ను ఎందుకు ఎంచుకున్నారన్న ప్రశ్న, తనకు ఎదురైన వేళ, బండ్ల గణేష్ స్పందించారు. తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అభిమానినని తెలిపిన ఆయన, తన ఆరేళ్ల వయసులో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారని, ఆపై శ్రీపెరంబుదూరులో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారని, ఆ ఘటనలన్నీ తనకు తెలుసునని చెప్పారు. తాను ఎప్పుడు ఓటు వేసినా కాంగ్రెస్ పార్టీకే ఓటేశానని వెల్లడించిన ఆయన, పవన్ కల్యాణ్ అంటే తనకెంతో అభిమానమని, ఆయన బాగుండాలని, ఆయన పార్టీ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
తనకు సినిమారంగమంటే ప్రాణమని, తనను ఆదరించి, ఆశీర్వదించిన తండ్రి వంటి వ్యక్తి పవన్ కల్యాణ్ అని చెప్పిన బండ్ల, అంతమాత్రాన రాజకీయాల్లోకి రావాలంటే ఆయన పార్టీనే ఆశ్రయించాలని ఏమీ లేదని అన్నారు. ఆయన తనకు దేవుడు వంటివారని, ఆయన గురించి ఇప్పుడేమీ మాట్లాడబోనని చెప్పారు. తనను రాహుల్ కు పరిచయం చేసిన కుంతియాగారికి కృతజ్ఞతలు చెప్పారు. తనపై ఉన్న కేసులకు భయపడే కాంగ్రెస్ లో చేరినట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కేసులుంటే అధికారపక్షంలో చేరుతారే తప్ప, ప్రతిపక్షంలో ఎవరు చేరుతారని ప్రశ్నించారు. ఓ కాంగ్రెస్ నేతగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తనవంతు పాత్రను పోషిస్తానని అన్నారు.