Telangana: తెలంగాణలో పొత్తుకు రాహుల్ గ్రీన్ సిగ్నల్.. స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు!
- తెలంగాణ నేతలకు రాహుల్ దిశానిర్దేశం
- పొత్తులపై మీడియాకు ఎక్కవద్దని సూచన
- అభ్యర్థుల ఎంపికకు కమిటీ ఏర్పాటు
తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించేందుకు టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలతో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అంగీకరించారు. ఈ రోజు 40 మంది సీనియర్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో పొత్తు ప్రతిపాదనకు రాహుల్ ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.
పార్టీ నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తితే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. అనవసరంగా మీడియాకు ఎక్కవద్దనీ, పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పారు. కాంగ్రెస్ గెలవగలిగే సీట్ల విషయంలో జాగ్రత్తగా డీల్ చేయాలని రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ వివరాలను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితర అంశాలను డీల్ చేసేందుకు ముగ్గురు సభ్యులతో స్క్రీనింగ్ కమిటీని నియమించారు. ఈ కమిటీకి కాంగ్రెస్ నేత భక్తచరణ్ దాస్ నేతృత్వం వహిస్తుండగా, జ్యోతిమణి, శర్మిష్ట ముఖర్జీలు సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎవ్వరూ కూడా పొత్తులపై, ఇతర ప్రతిపక్ష నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ ఆదేశించారు.